దశలవారీగా ఉద్యోగాల భర్తీ : డిప్యూటీ  సీఎం భ‌‌ట్టి విక్రమార్క 

  • అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 54 వేల నియామకాలు: భట్టి విక్రమార్క
  • మండలిలో ప్రకటించిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 54 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేశామని డిప్యూటీ  సీఎం భ‌‌ట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌‌ను దశలవారీగా భ‌‌ర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం శాసనమండలిలో.. ప్రభుత్వ ఉద్యోగాల భ‌‌ర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు 55,172 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని, ఎంపికైన వారిలో ఇప్పటికే 54,573 పోస్టులకు నియామకపత్రాలను అందించామని వివరించారు.

తాము అధికారంలోకి వ‌‌చ్చిన వెంట‌‌నే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించ‌‌డంతో పాటు 10,006 మంది టీచర్లకు నియామ‌‌క ప‌‌త్రాలు అంద‌‌జేశామ‌‌న్నారు. బీఆర్​ఎస్​ పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చారే తప్ప పరీక్షలు నిర్వహించలేదని విమర్శించారు. ఉద్యోగార్థులు ఆందోళ‌‌న చెందాల్సిన అవ‌‌స‌‌రం లేద‌‌ని ఆయన సూచించారు.  ఉద్యోగాల భ‌‌ర్తీ కోస‌‌మే జాబ్ క్యాలెండ‌‌ర్ ప్రక‌‌టించామ‌‌ని, రాష్ట్రంలో ఖాళీల‌‌ను అంచ‌‌నా వేసి టీజీపీఎస్సీ ద్వారా ప‌‌రీక్షలు నిర్వహిస్తామ‌‌ని చెప్పారు.  ఇప్పటికే  ప్రక‌‌టించిన జాబ్ క్యాలెండ‌‌ర్ ప్రకారం నోటిఫికేష‌‌న్లు జారీ చేస్తామ‌‌న్నారు. ప్రశ్నా ప‌‌త్రాల లీక్‌‌, మాల్ ప్రాక్టీస్ జ‌‌ర‌‌గ‌‌కుండా పార‌‌ద‌‌ర్శకంగా ప‌‌రీక్షలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

బీఏసీలో బీఆర్ఎస్ తీరు సరిగ్గా లేదు..

బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ నిబంధనల మేరకే బీఏసీ జరిగిందని, అసెంబ్లీ ఎన్ని రోజులు నడుపాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు. పదేండ్లు పాలించిన వారికి ఈ విషయం తెలియాదా అని ఫైర్ అయ్యారు.

హరీశ్ రావు చెప్పినట్టు సభ పని దినాలు ఉండాలంటే ఎలా అని ప్రశ్నించారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీని ఎలా నడిపిందో తనకు తెలియాదా అని అన్నారు. ఇప్పుడు కూడా సభ ఎన్ని రోజులు నడపాలన్నది స్పీకరే నిర్ణయిస్తారని, బీఆర్ఎస్ నేతలు కాదని స్పష్టం చేశారు.